విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి – అకుల సతీష్
కుత్బుల్లాపూర్: సూరారం పాండు బస్తీలో నిర్వహిస్తున్న AV Model Schoolకు సంబంధించిన అనుమతులు, గుర్తింపు, పాఠశాల నిర్వహణపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరికి ఫిర్యాదు చేసినట్లు అకుల సతీష్ తెలిపారు.
ఫిర్యాదుపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, అలాగే మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారికి (DEO) ఫిర్యాదును పంపించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.
పాఠశాలకు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ అనుమతి, గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలితే పాఠశాలను సీజ్ చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు అకుల సతీష్ పేర్కొన్నారు.
అనుమతుల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల ఇప్పటికే అక్కడ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడకూడదని, అవసరమైతే వారిని సమీపంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చేర్పించి వారి విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా విద్యార్థులకు TCలు, విద్యా రికార్డులు, బోర్డు రిజిస్ట్రేషన్, SSC/10వ తరగతి పరీక్షల నమోదు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మహిళా ఉపాధ్యాయురాలి అంశంపై కూడా విచారణ చేయాలిపాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలితో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు, ఆమె బంధువులపై దాడి జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సూరారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు.
మహిళా ఉపాధ్యాయురాలి విషయంలో వచ్చిన ఆరోపణలను తాము అంగీకరించబోమని, ఈ అంశంపై డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి మరోసారి ఫిర్యాదు చేయడంతో పాటు తెలంగాణ మహిళా కమిషన్ను కూడా ఆశ్రయించి చర్యలు కోరుతామని అకుల సతీష్ తెలిపారు.తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
పిల్లలను పాఠశాలలో చేర్పించే ముందు తల్లిదండ్రులు ఆ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు, చెల్లుబాటు అయ్యే అనుమతులు, సంబంధిత విద్యాశాఖ రిజిస్ట్రేషన్ ఉన్నాయా లేదా తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని సూచించారు.
పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కేవలం యాజమాన్యం ఇచ్చే హామీలపై ఆధారపడకుండా, సంబంధిత విద్యాశాఖ అధికారుల ద్వారా పాఠశాల గుర్తింపు వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే అడ్మిషన్ తీసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ వ్యవహారంలో అధికారులు జాప్యం చేయకుండా సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించి, నిబంధనల ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అకుల సతీష్, నల్ల జై శంకర్ గౌడ్, కంది శ్రీరాములు, జి. శ్రీనివాస్, అంగడి మల్లేష్, యాదగిరి యాదవ్, వనమాల, నాగరాజ్ గౌడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

