7tv focus : తెలంగాణలోని వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఒక ఎస్సై సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 26 మంది గాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూటౌన్ ఠాణాలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కే. వెంకన్న(57) గణేశ్ నిమజ్జన బందోబస్తు కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ కు వచ్చారు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు వెంకన్న కుటుంబానికి అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ హామీ ఇచ్చారు. ఇక పరారీలో ఉన్న నిందితుడి కోసం సైఫాబాద్ పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. Also Read కదిలిన ఖైరతాబాద్ బడా గణేశుడు.. రంగంలోకి 45 వేల మంది పోలీసులు! ఇక పఠాన్ చెరులో ఆరుగురు యువకులు గణేష్ నిమజ్జనంలో ప్రమాదవశాత్తూ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఖైరతాబాద్ లో ఒకరు, నిర్మల్ లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి డీజే సౌండ్స్ కారణంగా గుండెపోటుకు గురై మృతి చెందారు. ఈ మేరకు ఈ వివరాలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్వయంగా వెల్లడించారు. మరోవైపు వినాయక చవితి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 1.24 లక్షల వినాయక విగ్రహాలను మండపాల్లో ప్రతిష్టించారని వెల్లడించారు. ఇక ఇళ్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో, అపార్ట్ మెంట్స్ లో కలిపి 3.5 లక్షల నుండి 4 లక్షల మధ్య వినాయకులు ప్రతిష్టించారని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిర్వహణతో పాటు భద్రతా చర్యలను కూడా పోలీసులు నిరంతరం పర్యవేక్షించినట్లు డీజీపీ వివరించారు. పోలీసులు విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ నిమజ్జన వేడుకల సందర్భంగా జరిగిన దురదృష్టకర ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోవడం, 26 మంది గాయపడటం తీవ్ర విషాదాన్ని నింపిందని అన్నారు.

