7tv focus : ధాన్యం సేకరణ కేవలం వ్యాపార లావాదేవీ కాదని.. రైతులకు న్యాయం చేసే పవిత్ర బాధ్యత అని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. కల్లాల వద్ద నుంచే ధాన్యం రవాణాను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ సిబ్బందిదే అని ఆదేశించారు. విజయవాడలో ఈరోజు (శుక్రవారం) ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్‌షాపులో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. గన్నీ బ్యాగుల లభ్యతపై కచ్చితమైన తనిఖీలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే హెచ్డీపీఈ బ్యాగులను వినియోగించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో ధాన్యం రవాణాకు 31వేల వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
అత్యాధునిక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాం..
గుజరాత్ తరహాలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రతికూల వాతావరణం, సమస్యలను మూడు రోజుల ముందే అంచనా వేసి నివేదించాలని ఆదేశించారు. గత ఖరీఫ్‌లో 92శాతానికిపైగా రైతు ఖాతాల్లో నగదు వేశామని తెలిపారు. 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ఈసారి అంచనా వేశామని చెప్పుకొచ్చారు. ఇందుకోసం 2619 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 6.1 కోట్ల ధాన్యం గన్నీ బ్యాగ్‌లను సిద్ధం చేశామని చెప్పారు. ఈ సంవత్సరం రవాణా ఖర్చులను కూడా రైతుల ఖాతాలో వేస్తామని తెలిపారు. 1.1 కోట్లకు అంచనాలు ఈసారి ఉన్నాయని.. ఇంకా మారితే మారవచ్చని చెప్పారు. రైతును రాజుగా భావించి తాము పని చేస్తామని వెల్లడించారు.
రైతన్నల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి..
కళ్లాల దగ్గర నుంచే ధాన్యాన్ని సేకరించి, నచ్చిన మిల్లులకే అన్నదాతలు తీసుకెళ్లవచ్చని మంత్రి అన్నారు. 1967 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు, జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేక అధికారులతో కాల్ సెంటర్లను నిర్వహించాలని సూచించారు. రైతన్నల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

