7tv focus : తెలంగాణలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ కీలక వివరాలను వెల్లడించారు. ఐసీసీసీ, డీజీపీ కార్యాలయం నుంచి నిమజ్జన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా జియో ట్యాగింగ్, సంబంధిత పోర్టల్లో నమోదైన సమాచారం ఆధారంగా 1,24,000 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు గుర్తించామని చెప్పారు. ఇవన్నీ పబ్లిక్ ప్లేస్లలో ఏర్పాటు చేసిన విగ్రహాల వివరాలు మాత్రమేనని స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సుమారు 8 వేల విగ్రహాలు అదనంగా ఏర్పాటు అయ్యాయని డీజీపీ తెలిపారు. గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 88 వేల విగ్రహాలు నిమజ్జనం పూర్తయినట్లు వెల్లడించారు. ఒక్కరోజులోనే 6,350 విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు చెప్పారు. ఇంకా సుమారు 25,500 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.హైదరాబాద్లో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ విస్తృత భద్రతా చర్యలు చేపట్టిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నగరవ్యాప్తంగా సుమారు 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిమజ్జన మార్గాలు, ప్రధాన ప్రాంతాలు, చెరువులు, కీలక కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఏరియల్ సర్వే కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. ఇంకా పెద్ద సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి తరలిరావాల్సి ఉన్నందున పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పారు. రాబోయే గంటల్లో నిమజ్జనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, నిమజ్జన ప్రాంతాల్లో రద్దీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

