7tv focus : వాహనాలు చోరీలకు గురైతే ఇకపై పట్టుకోవటం చాలా సులువని చెప్తున్నారు పోలీసులు. వాహన చోరీల సమస్యకు పరిష్కారం చూపేందుకు తెలంగాణ పోలీసులు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. చోరీకి గురైన వాహనాలను వేగంగా గుర్తించేందుకు ‘టీజీ ఈ-టికెట్’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఏటా దాదాపు 7 వేల నుంచి 8 వేల వాహనాల చోరీ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 90 శాతం వరకు బైక్లే ఉంటున్నాయి. అంతర్రాష్ట్ర ముఠాలు ఒక చోట దొంగిలించి మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉండటంతో పోలీసులు టెక్నాలజీ సహాయం తీసుకుంటున్నారు. వాహనం పోయిన వెంటనే యజమాని సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. అప్పుడే వాహన నంబర్, మోడల్ వంటి వివరాలు డేటాబేస్లో చేరుతాయి. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు తమ ట్యాబ్లలో ఈ యాప్ను వాడుతున్నారు. తనిఖీల సమయంలో అనుమానాస్పద వాహనం కనిపిస్తే ఫొటో తీస్తే చాలు. అది ఇప్పటికే చోరీ కేసులో నమోదై ఉంటే యాప్ వెంటనే అలర్ట్ ఇస్తుంది. అలా ఆ వాహనం పట్టుకోవటం ఈజీ అవుతుంది.

