7tv focus : సెలవు దినం.. ఆ ఇంట అంతా సందడిగా ఉంది. ఆడుకుంటూ అటూఇటూ తిరుగుతున్న ఆ నాలుగేళ్ల చిన్నారికి కారు రూపంలో మృత్యువు పొంచి ఉందన్న విషయం ఎవరూ ఊహించలేకపోయారు. ప్రమాదవశాత్తు కారులో ఇరుక్కుపోయి, ఊపిరాడక ఆ పసిప్రాణం అనంతలోకాలకు చేరింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వినోబానగర్ గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్, ఐశ్వర్య దంపతుల పెద్ద కుమార్తె తన్వితశ్రీ (4) ఆదివారం ఆడుకుంటూ ఇంటి వద్ద నిలిచిన కారులో ఎక్కింది. ప్రమాదవశాత్తు కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక చనిపోయింది.
ఆ సమయంలో తండ్రి నవీన్ వైరా ఎమ్మెల్యేను కలిసేందుకు సర్పంచులతో కలిసి ఉదయం కొత్తగూడెం వెళ్లారు. తల్లి ఐశ్వర్య ఇంటి పనుల్లో నిమగ్నమయ్యారు. చిన్నారి కనిపించకపోవడంతో తల్లి ఐశ్వర్య ఆందోళనకు గురయై కుటుంబ సభ్యులతో కలిసి ఇల్లు, పరిసర ప్రాంతాలతో పాటు గ్రామంలో వెతికారు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో కారులో తన్వితశ్రీ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు

