హైదరాబాద్ 7tv focus : హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్ దుర్గం చెరువు పరిసర ప్రాంతంలో గురువారం రాత్రి ఓ ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ సాఫ్ట్వేర్ సంస్థ కార్యాలయం సమీపంలో భారీ కొండచిలువ హఠాత్తుగా ప్రత్యక్షమైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, రాత్రి వేళల్లో విధులకు హాజరయ్యే ఐటీ ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరుగులు తీశారు. నిత్యం జనసంచారంతో ఎంతో రద్దీగా ఉండే దుర్గం చెరువు ఐటీ లేన్ పరిసరాలలో ఇంత పెద్ద కొండచిలువ కనిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది.దీనికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఐటీ కార్యాలయానికి వెళ్లే ప్రధాన ద్వారానికి సమీపంలో ఆ పెద్ద కొండచిలువ కనిపించింది. దీన్ని గమనించిన వాహనదారులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకున్నాడు. ఎంతో చాకచర్యంగా, దానికి ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకున్నాడు. తన చేతికి చుట్టుకుని స్కూటర్ పై వెళ్లిపోయాడతను.10- 15 ఏళ్ల కిందటి వరకు కూడా దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మినీ అడవిని తలపించేవి. పెద్ద పెద్ద రాతి గుట్టలు, సహజసిద్ధమైన పొదలతో వన్యప్రాణులకు అనుకూలమైన ప్రదేశంగా ఉండేవి. ఈ భౌగోళిక కారణాల వల్ల ఇక్కడ వన్యప్రాణుల సంచారం ఎప్పటి నుంచో సహజంగానే ఉంటోంది. ఇటీవలి కాలంలో ఐటీ కారిడార్లో కాంక్రీట్ కట్టడాలు రికార్డు స్థాయిలో పెరిగిపోవడంతో వాటి సహజ ఆవాసాలు క్రమంగా హరించుకుపోయాయి.భారీ వర్షాలు కురిసిన సమయంలో వాటి నివాసాల్లోకి పెద్దఎత్తున నీరు చేరినప్పుడు ఇటువంటి కొండచిలువలు లేదా సరీసృపాలు పొడి ప్రదేశాల కోసం హఠాత్తుగా రోడ్లపైకి వస్తుంటాయని చెబుతున్నారు. రాత్రి సమయాలలో షిఫ్ట్లకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి చుట్టుపక్కల మార్గాల్లో వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.

