7tv focus : పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. కొందరికి వింతవింత ఆలోచనలు వస్తుంటాయి. సరిగ్గా అలాంటి వింత, విచిత్ర ఆలోచనే తమిళనాడు లోని ఇద్దరు యువకులకు వచ్చింది. అయితే ఆ ఆలోచనే వారిని చావు దగ్గరికి వరకు తీసుకెళ్లింది. ధర్మపురి జిల్లా మారండహళ్లిసమీపంలోని కుమారచెట్టి గ్రామం లో ఈ నెల 20 న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.స్నేహితులైన ఇద్దరు యువకులు థార్ వాహనంలో గ్రామ చెరువు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో చెరువులో నీరు తక్కువగా ఉండటంతో నీళ్ల మధ్యలో వాహనం పెట్టుకుని మద్యం సేవించాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లే వాహనాన్ని నేరుగా నీళ్లలోపలికి నడుపుకెళ్లారు. అక్కడే ఫుల్లుగా మద్యం తాగారు. మత్తు ఆవహించడంతో ఆ వాహనంలోనే నిద్రలోకి జారుకున్నారు. అర్థరాత్రి తర్వాత ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దాంతో చెరువులోకి వరదనీరు చేరి నీటిమట్టం పెరిగింది. నీళ్లు తగలడంతో మత్తు నుంచి తేరుకున్న యువకులు భయంతో జీపుపైకి ఎక్కి సాయం కోసం పెడబొబ్బలు పెట్టారు.వారి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ పొక్లెయిన్ సహాయంతో వారిని బయటికి తీసుకొచ్చారు. వాహనానికి తాళ్లు కట్టి ఒడ్డుకు ఈడ్చుకొచ్చారు. ఈ ఘటనలో యువకులకు ఎలాంటి అపాయం జరగలేదు. ఇద్దరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సహాయక చర్యలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువకుల పేర్లు, ఇతర వివరాలు బయటకు వెల్లడించలేదు.

