7tv focus : రష్యాతో వాణిజ్యానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భారత్, చైనా, తుర్కియే దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా పిలుపునిచ్చారు. ఇంధన వాణిజ్యానికి ముగింపు పలకాలని అన్నారు. రష్యా తన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకునేందుకు ఈ దేశాలపైనే అధికంగా ఆధారపడుతోందని అంతర్జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత్, చైనా, అమెరికాల ఒత్తిడి పెరిగితే ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని కొనసాగించలేదని అన్నారు.‘రష్యా అష్టదిగ్బంధనంలో ఉంది. వాళ్ల ఆర్థిక వ్యవస్థ భారత్, చైనా, తుర్కియేపై ఆధారపడి ఉంది. వీళ్లు ఈ ఇంధన వాణిజ్యాన్ని కట్టిపెడితే, అమెరికా ఒత్తిడి పెంచితే.. రష్యా క్షణాల్లో యుద్ధాన్ని కట్టిపెడుతుంది. చైనా, భారత్లు కలిసి ఒత్తిడి పెంచితే చాలు’ అని అన్నారు. యుద్ధం ముగించే దిశగా చర్చలు జరపడం అంత ఈజీగా కాదని కూడా జెలెన్స్కీ అన్నారు. యుద్ధం ముగింపునకు పుతిన్ సిద్ధంగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు.ఆగస్టులో భారత్కు రష్యా ముడి చమురు దిగుమతులు రోజుకు 2.1 మిలియన్ బ్యారెళ్లుగా నిలిచాయి. అంతకుముందు నెలతో పోలిస్తే 16.5 శాతం మేర తగ్గినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారత్కు ముడి చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా ఇప్పటికీ టాప్లో ఉంది. ఆ తరువాతి స్థానంలో యూఏఈ, వెనెజువెలా దేశాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. హోర్ముజ్లో ఘర్షణల తరువాత రష్యా ముడిచమురు దిగుమతులను భారత్ పెంచిన విషయం తెలిసిందే.

