7tv focus : జూరాల ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్కు తాగు, సాగునీటి అవసరాలపై అవగాహన లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 9 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయన్నారు. తాగునీటి అవసరాలకు 1.05 టీఎంసీల నీళ్లు మాత్రమే అవసరమని చెప్పుకొచ్చారు. స్థానిక నాయకులకు అవగాహన లేకుండా తొమ్మిది TMCల నీటి నిల్వ ఉంచి.. రైతుల సాగుకు నీళ్లు ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. సాగునీటి అవసరాలకు ఆరు టీఎంసీల నీటిని ఉపయోగించుకోవచ్చని సూచించారు. తాగునీటి అవసరాలకు నీళ్లు లేకపోతే కర్ణాటకలో 150 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని.. అక్కడి ప్రభుత్వాన్ని అడిగి తీసుకునే వెసులుబాటు ఉందని వెల్లడించారు.ఎమ్మెల్యేలకు, మంత్రులకు సాగునీటిపై కనీసం అవగాహన లేదని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు పేరొస్తుందనే కక్షతో రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ తీర్చుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి వంక పెట్టి సాగునీరు ఇవ్వకుండా దొంగ డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘నీటి లెక్కల విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ఉంటే.. నన్ను జైలుకు పంపండి. లేదంటే మీరు ముక్కు నేలకు రాసి చంపలేసుకుని రైతులకు సాగునీటిని ఇవ్వండి’ అని డిమాండ్ చేశారు.

