7tv focus : పాక్‌తో స్నేహబంధాన్ని పెంచుకునేందుకు తహతహతహ లాడుతున్న బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్ తగిలింది. అణుఇంధనంతో బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన రష్యా విమానాన్ని తమ గగనతలం మీదుగా అనుమతించేందుకు పాక్ నిరాకరించింది. చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్ ఇందుకు గల కారణాన్ని కూడా వివరించకపోవడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం నోరెళ్లబెట్టింది.బంగ్లాదేశ్ ప్రస్తుతం విద్యుత్ కొరతతో సతమతం అవుతోంది. ఇటీవల నిర్మాణం పూర్తైన రూప్పూర్ అణుకేంద్రం రెండవ యూనిట్ నుంచి వీలైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది. ఈ కేంద్రం నిర్మాణంలో రష్యా ప్రభుత్వ రంగ అణుఇంధన సంస్థ రోసాటమ్ కీలక పాత్ర పోషించింది. రోసాటమ్‌కు చెందిన ఓ విమానం అణుఇంధనంతో బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు సిద్ధం కాగా పాక్ చివరి నిమిషంలో మోకాలడ్డు పెట్టింది. అజర్బైజాన్, కజకస్థాన్, పాకిస్థాన్, భారత్ మీదుగా విమానం బంగ్లాదేశ్‌కు చేరాల్సి ఉన్నా పాక్ నిర్ణయంతో బ్రేకులు పడ్డాయి. దీంతో, బంగ్లాదేశ్‌లో అణు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం మరింత ఆలస్యం కానుంది.రష్యా విమానానికి పాక్ అనుమతులు ఇవ్వకపోవడం నిజమేనని బంగ్లాదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫకీర్ మెహబూబ్ ఆనమ్ తెలిపారు. చివరి నిమిషంలో అనుమతులను నిరాకరించారని చెప్పారు. ఇందుకు గల కారణాలను కూడా పాక్ చెప్పలేదని ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

