7tv focus : ఒక మహిళతో ప్రధాని మోదీ ఉన్న ఏఐ మార్ఫుడ్ ఫొటోను సీజేపీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో బాధిత మహిళ ఏకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ పోస్టును తొలగించాల్సిందిగా మెటా సంస్థను ఆదేశించింది. అలాగే, సీజేపీ సహా ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, కీలక నేతలు అశుతోష్ రాంకా, రత్నా సింగ్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీ ఒక మహిళతో ఉన్నట్లుగా మార్ఫింగ్ చేసిన ఫొటోను ఇటీవల సీజేపీ నేతలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు.దీంతో ఈ అంశంపై బాధిత మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. జస్టిస్ గిరీష్ కత్పాలియా ఆధ్వర్యంలోని బెంచ్ దీనిపై విచారణ జరిపింది. ఈ అంశం ఒక అసాధారణ పరిస్థితికి సంబంధించిందన్నారు. ఎందుకంటే.. ఒక సాధారణ మహిళతోపాటు, దేశ ప్రధాని ఉన్న ఫొటోకు సంబంధించిన అంశమని కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ పోలీసులు ఈ విషయంలో సున్నితంగా వ్యవహరించకపోతే.. కోర్టు సున్నితంగా స్పందిస్తుందని తెలిపింది. ఈ అంశంలో సీజేపీ నేతలకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. ఫొటోలు, దీనికి సంబంధించి అన్ని పోస్టులు తొలగించాలని సోషల్ మీడియా సంస్థ మెటాను ఆదేశించింది.

