7tv focus : ఎల్నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది ఇదే రోజుల్లో కేవలం 240 మిలియన్ యూనిట్లుగా ఉందని.. ఇప్పుడు రోజువారి వినియోగం 290 మిలియన్ యూనిట్లకు చేరిందని వెల్లడించారు. అధిక ఎండల వలన ఈ ఏడాది దాదాపు 20 శాతంపైగా విద్యుత్ వినియోగం పెరిగిందని వివరించారు. జెన్కో సంస్థ రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా పెరిగిన వినియోగంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా బయట నుంచి కొనుగోళ్లు చేసి విద్యుత్ అంతరాయాలు లేకుండా చూస్తున్నామని చెప్పారు.గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలలో పవర్ కట్స్ లేకుండా చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రతి వారం విద్యుత్ శాఖపై సమీక్ష చేసి దిశానిర్దేశం చేస్తున్నారని అన్నారు. ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు.

